అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో మోసం చేసిన ఘటన గుజరాత్‌లోని వడోదరలో వెలుగుచూసింది. ఫతేగంజ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారిని సైబర్ నేరగాళ్లు వాట్సాప్ గ్రూపులో చేర్చి, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే రోజుకు 5 నుంచి 20 శాతం వరకు రాబడి వస్తుందని నమ్మించారు. ఈ క్రమంలో బాధితుడి నుంచి సుమారు రూ.1.95 కోట్లను వివిధ దఫాల్లో మోసపూరితంగా తీసుకున్నారు.
బాధితుడిని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ది గేట్ ఆఫ్ వెల్త్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో చేర్చినట్లు సమాచారం. గ్రూపులో నిషా వర్మ అనే వ్యక్తి షేర్ మార్కెట్ ట్రేడింగ్‌కు సంబంధించిన సూచనలు ఇస్తున్నట్లు నటించింది. అనంతరం ఉమేశ్ శర్మ అనే వ్యక్తి మరో గ్రూపులోకి చేర్చి, డీఎంఏ ట్రేడింగ్ ఖాతా తెరవాలని సూచించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత పెట్టుబడుల కోసం ఒక లింక్ పంపించి, దాని ద్వారా వివరాలు నమోదు చేయించారు. బాధితుడి పేరుతో ఆన్లైన్ ఖాతా కూడా తెరిచారు.
తాము సెబీలో నమోదైన సంస్థకు చెందినవారమని నమ్మించేందుకు నకిలీ ధ్రువపత్రాలను పంపినట్లు పోలీసులు తెలిపారు. ఆ పత్రాలను చూసిన బాధితుడు ఆ సంస్థపై నమ్మకం పెట్టుకుని పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. సుమారు రెండున్నర నెలల వ్యవధిలో వ్యాపారి ఆన్లైన్ ఖాతాలో మొత్తం రూ.1.95 కోట్ల వరకు జమ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతనికి తిరిగి వచ్చిన మొత్తం కేవలం రూ.2.32 లక్షలేనని వెల్లడైంది. మరోవైపు ఆన్లైన్ ఖాతాలో రూ.6.16 కోట్ల వరకు నిల్వ ఉన్నట్లు చూపించినప్పటికీ, ఆ మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వలేదు. దీంతో బాధితుడికి అనుమానం వచ్చింది.
ఇంతలో నగదు ఉపసంహరణకు ముందు మనీ లోడింగ్ పేరుతో మరో రూ.20 లక్షలు చెల్లించాలని మోసగాళ్లు కోరినట్లు సమాచారం. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన వ్యాపారి సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు సైబర్ నేరగాళ్లు నకిలీ సెబీ నమోదు ధ్రువపత్రాలను చూపిస్తున్న ఘటనలు జరుగుతున్నాయని వడోదర సైబర్ సెల్ అధికారులు హెచ్చరించారు. సైబర్ సెల్ ఏసీపీ మయూర్సింగ్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ఏదైనా పెట్టుబడి సంస్థ సెబీలో నమోదైందని చెబితే, సంబంధిత అధికారిక రికార్డుల్లో ఆ సంస్థ వివరాలను స్వయంగా పరిశీలించాలని సూచించారు. కేవలం వాట్సాప్‌లో పంపిన ధ్రువపత్రాలను చూసి నమ్మి భారీ మొత్తాలను పెట్టుబడి పెట్టవద్దని హెచ్చరించారు.
అధిక రాబడికి హామీ ఇచ్చే ఆన్లైన్ పెట్టుబడి పథకాలు, గుర్తుతెలియని లింకులు, వాట్సాప్ గ్రూపులు, నకిలీ ట్రేడింగ్ ఖాతాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పెట్టుబడి పెట్టే ముందు సంస్థకు సంబంధించిన నమోదు వివరాలు, అధికారిక వెబ్సైట్, సంప్రదింపు వివరాలు, నియంత్రణ సంస్థ రికార్డులను తప్పనిసరిగా పరిశీలించాలని పేర్కొన్నారు.
వడోదరలో ఒక వ్యాపారిని ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. రోజుకు 20 శాతం రాబడి వస్తుందని నమ్మించి, నకిలీ సెబీ ధ్రువపత్రాలు చూపించి రూ.1.95 కోట్లు తీసుకున్నారు. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.












