తెలుగుదేశం పార్టీ తన 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్చూరు నియోజకవర్గంలోని కారంచేడులో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండా ఆవిష్కరణ, ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని, ఆయన మార్గనిర్దేశంలో పార్టీ ప్రజల మద్దతుతో ముందుకు సాగిందని పేర్కొన్నారు. సామాన్యులకు రాజకీయాల్లో సేవ చేసే అవకాశాన్ని కల్పించిన ఘనత ఎన్టీఆర్ దేనని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీకి ఆధునికతను జోడించి, రాష్ట్రాన్ని అభివృద్ధి, సాంకేతిక రంగాలలో పురోగమింపజేస్తున్నారని ప్రశంసించారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ, ప్రజల సంక్షేమానికి చంద్రబాబు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు.
తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల ప్రస్థానం ప్రజాకాంక్షలకు, ఆశయాలకు ప్రతీకగా నిలిచిందని నాయకులు అభివర్ణించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.








