Dornala, 7 September
మార్కాపురం జిల్లా ప్రజల జీవనాధారమైన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం పోరాడిన సీపీఐ నేత పూల సుబ్బయ్య విగ్రహాన్ని ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు మొదటి దశ పూర్తయి కృష్ణా జలాలు విడుదల కావడం హర్షణీయమని ఆయన అన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు వద్ద... పూల సుబ్బయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. సీపీఐ జాతీయ నేత డాక్టర్ కె నారాయణ మార్కాపురం. కరువు కాటకాలతో నతమతమవుతున్న మార్కాపురం జిల్లా ప్రజానీకానికి వరప్రసాదమైన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం తుది శ్వాస వరకు ఉద్యమాన్ని కొనసాగించిన సీపీఐ నేత పూల సుబ్బయ్య విగ్రహాన్ని వెలిగొండ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మండలం గంటవానిపల్లె గ్రామం వద్ద వున్న ఫీడర్ కెనాల్ ను సందర్శించిన అనంతరం స్థానిక స్థానిక ప్రెన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ అనేక దశాబ్దాల పోరాటాల ఫలితంగానే శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణ పనులు పూర్తి చేసుకొని కృష్ణా జలాలను వెలిగొండ ప్రాజెక్టులోకి విడుదల కావడం హర్షణీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 1984 దశకంలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మార్కాపురం వచ్చిన సందర్భంగా సీపీఐ నాయకత్వంలోని ప్రతినిధి బృందం సభ్యులు పూల సుబ్బయ్య, గుజ్జుల యలమందారెడ్డి, రావులపల్లి చెంచయ్య తదితర నాయకులు వెలిగొండ ప్రాజెక్టు ప్రాముఖ్యత గురించి, ఈ ప్రాంతంలోని వర్షాభావ పరిస్థితులు, కరువు కాటకాల గురించి ఆయనకు వివరించడం జరిగిందన్నారు. అందుకు స్పందించిన ఎన్టీరామారావు పూల సుబ్బయ్య పేరుతో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి సర్వే చేసేందుకు జీవోను కూడా అధికారికంగా విడుదల చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అదే పేరుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా నామకరణం కావడం శుభపరిణామం అని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు సాధనలో ఎవరు అవునన్నా కాదన్నా ఈ క్రెడిట్ అంతా భారత కమ్యూనిస్టు పార్టీకే చెందుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎన్టీరామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు, డాక్టర్ వైయన్ రాజశేఖర్రెడ్డి, జగన్మోహన్రెడ్డిలు ఎవరిపాత్ర వారు పోషించి ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారని వారందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు కు ఒక సొరంగం ద్వారా నీరు నరిపోదని రెండవ సొరంగం నిర్మాణం చేపట్టాలని సీపీఐ ఉద్యమం ఫలితంగానే అది సాధ్యమైందని అన్నారు. మొదటి దశ నిర్మాణ పనులు పూర్తి కావడం సంతోషమేనని, అలాగే రెండవ దశ నిర్మాణ పనులు కూడా వేగవంతంతో పూర్తి చేయాలని అప్పుడే ఈ ప్రాంతానికి పరిపూర్ణంగా న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 32 మండలాలు సస్యశ్యామలం కావడంతో పాటు 20 లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ అందుతుందని, దీంతో ఫ్లోరైడ్ సమస్య కూడా పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ప్రాంతంలో వేసిన పంటలు పండక, వంటకోసం తెచ్చిన అప్పులు తీర్చలేక రైతులు అనేక కష్ట నష్టాలను, ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి వస్తున్న కృష్ణా జలాల ద్వారా వెనుకబడిన మార్కాపురం జిల్లా భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు మొదట శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీరామావుకే దక్కుతుందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ అన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు సాధనలో సీపీఐ పోరాటాలు, త్యాగాలు మరువలేనివని అన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున వలసలు ఉండేవని, వెలిగొండ ప్రాజెక్టు కు నీరు రావడం ద్వారా మార్కాపురం జిల్లాలో భవిష్యత్తులో వ్యవసాయరంగ ఉత్పత్తులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉండాలని అన్నారు. ఆర్ఆర్ ప్యాకేజీ అందని నిర్వాసితులకు వెంటనే మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, పార్టీ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నయ్యద్ యాసిన్, కెవీ కృష్ణగౌడ్, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేవండ్ల శ్రీనివాస్, పార్టీ నాయకులు అందె నాసరయ్య, నియోజకవర్గ సెక్రటరీ ఎస్ కె కాశిం, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, ఏఐఎన్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్, పార్టీ నాయకులు వై రవీంద్రబాబు, బాణాల రామయ్య తదితరులు పాల్గొన్నారు.

