విజయవాడలో పేదల కోసం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. పేదలకు పట్టాభిషేకం పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలను అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 24,057 కుటుంబాలకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పించనున్నారు.
ఈ క్రమబద్ధీకరణ ద్వారా సుమారు రూ.9,800 కోట్ల విలువైన భూమిపై పేదలకు హక్కులు లభించనున్నాయి. మొత్తం 617 ఎకరాల విస్తీర్ణంలోని సుమారు 29.86 లక్షల చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరించనున్నారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ సుమారు రూ.24,297 కోట్లుగా అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
దశాబ్దాల క్రితం కేటాయించిన ఇళ్ల స్థలాలకు చట్టబద్ధమైన హక్కులు కల్పించడంతో, లబ్ధిదారులకు తమ నివాసాలపై శాశ్వత భరోసా లభించనుంది. ముఖ్యంగా విజయవాడ నగరంలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలకు ఈ పట్టాల పంపిణీ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాలతో పాటు కృష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం నియోజకవర్గం కలిపి, మొత్తం 8 నియోజకవర్గాలు, 15 మండలాల పరిధిలోని కుటుంబాలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందనున్నాయి. విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, గన్నవరం, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో లబ్ధిదారులు ఉన్నారు.
ఇదివరకే విశాఖపట్నంలో 28,445 కుటుంబాలకు రూ.8,874 కోట్ల విలువైన భూమిపై క్రమబద్ధీకరణ పట్టాలను అందించారు. ఇప్పుడు అదే తరహాలో విజయవాడలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ పట్టాల పంపిణీతో పేదల జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం జరుగుతోందని అధికారులు తెలిపారు.












