బాపట్ల, 2026-07-20
చీరాల మునిసిపాలిటీ పరిధిలో నెలకొన్న డ్రైనేజీ, రోడ్డు సమస్యల పరిష్కారం కోరుతూ దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని, మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసఫ్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన కమిషనర్‌కు వివరించారు.
చీరాల మునిసిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని, మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసఫ్‌కు పలు ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా షేక్ జిలాని మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను తక్షణమే మరమ్మతులు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరారు.
డ్రైనేజీ సమస్యల కారణంగా దోమలు అధికంగా పెరిగి ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొంటూ, ప్రత్యేక ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టి దోమల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా చీరాల మసీదు సెంటర్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆ రహదారి మరమ్మతులకు నిధులు మంజూరైనప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. వెంటనే రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు.
ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల అభివృద్ధి దృష్ట్యా వినతిలో పేర్కొన్న అన్ని సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని షేక్ జిలాని మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసఫ్‌ను కోరారు.

