తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీదారుల క్లెయిమ్‌లను చిన్నచిన్న కారణాలతో తిరస్కరిస్తోందని సీనియర్ జర్నలిస్ట్ సౌరి సుబ్బారావు ఆరోపించారు. నగదు రహిత చికిత్సను నిరాకరించి, అనంతరం రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌ను కూడా తిరస్కరించారని ఆయన తెలిపారు.
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీదారుల క్లెయిమ్‌లను చిన్నచిన్న కారణాలతో తిరస్కరిస్తోందని చీరాలకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సౌరి సుబ్బారావు ఆరోపించారు. తనకు కూడా ఆ సంస్థ ద్వారా చేదు అనుభవం ఎదురైందని ఆయన శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది రూ.10 లక్షల విలువైన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సూపర్ స్టార్ పాలసీని రూ.40 వేల ప్రీమియంతో తీసుకున్నానని తెలిపారు. చీరాలలో ఉన్న సమయంలో గుండెపోటు రావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకున్నానన్నారు. అనంతరం అదే రాత్రి హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స కోసం చేరినట్లు తెలిపారు. ఆసుపత్రిలో చేరిన వెంటనే నగదు రహిత చికిత్స కోసం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థకు సమాచారం అందించగా, నగదు రహిత చికిత్సకు అనుమతి నిరాకరించినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం ముందుగా చికిత్స ఖర్చులు చెల్లించి, రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించిందని తెలిపారు.
దీంతో సుమారు రూ.6 లక్షలు ఖర్చు చేసి గుండెకు రెండు స్టెంట్లు వేయించుకున్నానని, అనంతరం రీయింబర్స్మెంట్ కోసం బిల్లులు సమర్పించగా ఆ క్లెయిమ్‌ను కూడా తిరస్కరించారని సుబ్బారావు ఆరోపించారు. ఆ తర్వాత మరో రెండు స్టెంట్లు వేయించుకోవడానికి మరో రూ.6 లక్షలు ఖర్చయిందని, మొత్తంగా రూ.12 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఇన్సూరెన్స్ సంస్థ నుంచి ఎలాంటి చెల్లింపూ అందలేదని తెలిపారు. నగదు రహిత చికిత్సను ఎందుకు నిరాకరించారో, అనంతరం రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌ను ఎందుకు తిరస్కరించారో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ స్పష్టత ఇవ్వాలని సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై వినియోగదారుల ఫోరంలో కేసు దాఖలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.












