అన్నమయ్య, 2026-11-28
అన్నమయ్య జిల్లాలో నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జిల్లాలోని 10 మండలాల్లో మొత్తం 149 గ్రామ పంచాయతీలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
అన్నమయ్య జిల్లాలోని 10 మండలాల్లో 149 గ్రామ పంచాయతీలకు నేడు రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. పీలేరు డివిజన్లోని 6 మండలాల్లో 81 పంచాయతీలు, పుంగనూరు డివిజన్లోని 4 మండలాల్లో 68 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.
ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. బందోబస్తు విధులపై పోలీసు అధికారులకు సిబ్బందికి ప్రత్యేక దిశానిర్దేశం చేశారు. బ్యాలెట్ బాక్సులకు పటిష్ట భద్రత కల్పిస్తూ పోలీసు బలగాలు పోలింగ్ కేంద్రాలకు బయలుదేరాయి. సీఐలు, ఎస్ఐల ఆధ్వర్యంలో సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, స్పెషల్ పార్టీ సిబ్బంది ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉన్నారు.
ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.
ప్రజలందరూ ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.







