అనకాపల్లి, 2026-06-05
వయసుతో సంబంధం లేకుండా నిలదొక్కుకోవాలంటే నైపుణ్యాల అప్‌గ్రేడేషన్ అత్యవసరమని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ కమిటీ సభ్యులు, వినియోగదారుల రక్షణ, ఆర్టీఐ చట్టాల ఇన్ప్లుయెన్సనర్ కాండ్రేగుల వెంకటరమణ స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అనకాపల్లిలో జరిగిన మున్సిపల్ గవరపాలెం హైస్కూల్ 1994-1995 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వయసుతో సంబంధం లేకుండా నిలదొక్కుకోవాలంటే నైపుణ్యాల అప్‌గ్రేడేషన్ అత్యవసరమని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ కమిటీ సభ్యులు, వినియోగదారుల రక్షణ, ఆర్టీఐ చట్టాల ఇన్ప్లుయెన్సనర్ కాండ్రేగుల వెంకటరమణ స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని కర్రి జగన్నాథరావు ఏసీ ఫంక్షన్ హాలులో మున్సిపల్ గవరపాలెం హైస్కూల్ 1994-1995 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన, కంటి వైద్య శిబిరాలకు కాండ్రేగుల వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
కెరీర్ గైడెన్స్, ఆధునిక సాంకేతికత ఆవశ్యకత
సమాజంలో క్రియేటర్‌గా, లీడర్‌గా ఎదగాలనుకునే ఔత్సాహికులకు కెరీర్ గైడెన్స్ దిశానిర్దేశం చేస్తుందని, సృజనాత్మకతకు వయసుతో పనిలేదని ఆయన అన్నారు. ఏ రంగంలో ఉన్నా డిజిటల్ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక సాధనాలపై అవగాహన పెంచుకోవాలని, మూస పద్ధతులకు స్వస్తి పలికి, భిన్నంగా ఆలోచించడం ప్రారంభించాలని సూచించారు. నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు జారీ చేయడం కాదని, బృందాన్ని స్ఫూర్తివంతంగా నడిపించడమని, దీనికి సాఫ్ట్ స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో కీలకమని ఆయన వివరించారు. ఒకే ఆలోచనలు ఉన్న వ్యక్తులతో నెట్వర్కింగ్ పెంచుకోవాలని ఆయన హితవు పలికారు.
స్నేహంతో పాటు సామాజిక బాధ్యత
స్నేహితుల కలయిక కేవలం పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికే పరిమితం కాకూడదని, ప్రజా సమస్యల పరిష్కారం, ఆర్టీఐ, వినియోగదారుల హక్కులు, ప్రజా ప్రయోజన చట్టాల వినియోగం, హక్కుల సాధనలో ముందుండాలని కాండ్రేగుల వెంకటరమణ సూచించారు. వ్యక్తిగత విజయాన్ని సమాజ సేవతో ముడిపెట్టినప్పుడే జీవితం సార్థకమవుతుందని, స్నేహితుల చేతులు కలిస్తే సేవా శక్తి పుడుతుందని, అదే అభివృద్ధి చెందిన సమాజానికి నిజమైన పునాది అని ఆయన ఉద్ఘాటించారు. సాంకేతిక విప్లవం మనుషులను భౌతికంగా దగ్గర చేసినా, మనసులను కలిపేది మాత్రం పాఠశాల స్థాయిలో మొదలైన స్వచ్ఛమైన స్నేహమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
పూర్వ విద్యార్థుల అభినందన
స్నేహం, సేవ, సామాజిక బాధ్యతలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన పూర్వ విద్యార్థుల బృందాన్ని కాండ్రేగుల వెంకటరమణ అభినందించారు. ప్రభుత్వ అసిస్టెంట్ ప్రొఫసర్ విల్లూరి అప్పలనాయుడు భాగవతం, భగవద్గీత ప్రాధాన్యతలను వివరించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కె.ఎం.నాయుడు మాట్లాడుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న సహచర మిత్రులను ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ బ్యాచ్ పనిచేస్తుందన్నారు.











