చేజర్ల, 14 November
కులాంతర వివాహం చేసుకున్న దళిత మహిళ దాసరి అలేఖ్యపై జరిగిన హత్యాయత్నం కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయనందుకు అప్పటి ఒంగోలు వన్‌టౌన్ సీఐ నాగరాజుకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చార్జ్ మెమో జారీ చేశారు. కేసును అట్రాసిటీ చట్టం పరిధిలోకి మార్చి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
కులాంతర వివాహం చేసుకున్న దళిత మహిళ దాసరి అలేఖ్యపై జరిగిన హత్యాయత్నం కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయనందుకు వచ్చిన ఫిర్యాదుతో, అప్పటి ఒంగోలు వన్‌టౌన్ సీఐ నాగరాజుకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చార్జ్‌మెమో చేశారు. కేసును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలోకి మార్చి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఆయన వెల్లడించారు. వివరాల్లోకి వెళితే, ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న దాసరి అలేఖ్యపై గత ఏడాది ఆమె భర్త షేక్ భాషా బహిరంగంగా కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కులాంతర వివాహం నేపథ్యంలో కులం పేరుతో దూషణలు, బెదిరింపులు, దాడులు జరిగినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ, అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయలేదని దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై కలెక్టర్ రాజాబాబు, ఎస్పీకి పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రశాంతి కుమారి న్యాయపరమైన అభిప్రాయం మేరకు, కేసును అట్రాసిటీ చట్టం పరిధిలోకి మార్చి చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఎస్పీ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు అప్పటి సీఐ నాగరాజుకు చార్జ్‌మెమో చేసినట్లు ఆయన వెల్లడించారు.
దళిత మహిళకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్న ఎస్పీకి నీలం నాగేంద్రరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకుమాను రవి, పట్రా బంగారం, దామవరపు నాగసాయి తదితరులు పాల్గొన్నారు.


