మండలం చెరువు జమ్ములపాలెం గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాలపల్లి, ఆనందనగర్ కాలనీ, ఉప్పరపాలెం, యానాదుల సంఘం తదితర ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
పలు వీధుల్లో విద్యుత్ స్తంభాలు పక్కకు ఒరిగి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. మరికొన్ని ప్రాంతాల్లో హైవోల్టేజ్ విద్యుత్ తీగలు ప్రజలు, వాహనాలకు తగిలేంత తక్కువ ఎత్తులో వేలాడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. రహదారుల పక్కన ఉన్న చెట్ల కొమ్మల్లో విద్యుత్ తీగలు చిక్కుకుపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు.
ఒకవైపు ప్రాణాలకు ముప్పు కలిగించే విద్యుత్ లైన్లు, మరోవైపు పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు ప్రమాదకరమైన విద్యుత్ వ్యవస్థను సరిచేయడంలో నిర్లక్ష్యం చూపుతున్న అధికారులు, విద్యుత్ వృథాపై కూడా దృష్టి పెట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదిగా వినతులు.. స్పందన శూన్యం
సమస్యల పరిష్కారం కోసం గత ఏడాది కాలంగా పంచాయతీ కార్యాలయం, విద్యుత్ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది, ఉన్నతాధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా ప్రయోజనం లేకపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఈదురుగాలులు, భారీ వర్షాల సమయంలో ఏ స్తంభం నేలకొరుగుతుందో, ఏ విద్యుత్ తీగ తెగి రోడ్డుపై పడుతుందోనన్న భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లాలన్నా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని స్థానికులు తెలిపారు.
తల్లి, కొడుకు మరణం.. అయినా మారన పరిస్థితి
ఇటీవలే చెరువు జమ్ములపాలెం పంచాయతీ పరిధిలోని ఉప్పరపాలెంలో కిందపడిన విద్యుత్ వైరు తగిలి తల్లి, కొడుకు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొన్నప్పటికీ, విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు సమగ్ర చర్యలు కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోయిన తర్వాత వచ్చి పరిశీలనలు చేయడం కాదు, ప్రాణాలు పోకుండా ముందే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
మరో ప్రాణం పోకముందే చర్యలు తీసుకోండి
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. పంచాయతీ పరిధిలోని అన్ని కాలనీల్లో సమగ్ర విద్యుత్ భద్రతా తనిఖీలు నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదకరంగా ఒరిగిన స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేయడంతో పాటు, వేలాడుతున్న సర్వీస్ వైర్లు, మెయిన్ లైన్లను సరిచేయాలని కోరుతున్నారు. చెట్ల కొమ్మల్లో చిక్కుకున్న విద్యుత్ తీగలను వెంటనే తొలగించి, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరో నిండు ప్రాణం బలయ్యే వరకు వేచి చూడకుండా, ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలి అంటూ చెరువు జమ్ములపాలెం గ్రామస్తులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.


