బాపట్ల జిల్లా, చీరాల పట్టణంలో కనిపించకుండా పోయిన 15 ఏళ్ల బాలుడిని పోలీసులు చాకచక్యంగా గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ ఘటనలో చీరాల పోలీసుల మానవీయ స్పందన ప్రశంసలు అందుకుంది.
చీరాల పట్టణంలోని ఉజిలిపేటకు చెందిన 15 సంవత్సరాల బాలుడు కనిపించకుండా పోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చీరాల వన్‌టౌన్ సీఐ సోమశేఖర్‌ను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకున్న సీఐ వెంటనే స్పందించి, జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్, చీరాల డీఎస్పీ ఎం.డి. మోయిన్‌లకు సమాచారం అందించారు.
పోలీసుల గాలింపు చర్యలు
ఉన్నతాధికారుల ఆదేశాలతో సీఐ గారు చీరాల సబ్ డివిజన్ శక్తి టీం పోలీసులను రంగంలోకి దించి, బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల చురుకైన చర్యల ఫలితంగా రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఉన్న కార్తీక్‌ను గుర్తించి, క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
కన్నబిడ్డ కనిపించక ఆందోళనకు గురైన తల్లిదండ్రులకు తమ కుమారుడిని సురక్షితంగా తిరిగి అప్పగించడంతో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో స్పందించడం, సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టడం, బాలుడి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం పోలీసుల బాధ్యతాయుతమైన సేవలకు నిదర్శనంగా నిలిచాయి.
అభినందనలు
బాలల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన చీరాల పోలీసుల సేవలను పలు స్వచ్ఛంద సంస్థలు అభినందించాయి.
ఈ ఆపరేషన్‌లో ఎస్ఐ రాజ్యలక్ష్మి, శక్తి టీం సభ్యులు శివకుమారి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.












