వేటపాలెం, 2026-11-28
చీరాల నియోజకవర్గంలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దివ్యాంగ ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని బాపట్ల జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎన్నికల అధికారులను కోరింది. వీల్చైర్లు, చేతికర్రలు, తాగునీరు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేసింది.
ఆదివారం చీరాల నియోజకవర్గంలో జరగనున్న రెండవ దశ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగ ఓటర్లకు అవసరమైన ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని బాపట్ల జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధికార ప్రతినిధి మొగల్ సాలేహ బేగ్ ఇరు మండల ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద వీల్చైర్లు, తాగునీరు, చేతికర్రలు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో దివ్యాంగ ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి, ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనేక అవస్థలు పడాల్సి వచ్చిందన్నారు.
ఈ నేపథ్యంలో నేడు జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లోనైనా అధికారులు ముందస్తు చర్యలు తీసుకొని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వీల్చైర్లు, చేతికర్రలు, తాగునీరు అందుబాటులో ఉంచాలని కోరారు. అవసరమైన చోట దివ్యాంగ ఓటర్లకు సహాయక సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. దివ్యాంగులు కూడా స్వేచ్ఛగా, గౌరవప్రదంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మొగల్ సాలేహ బేగ్ విజ్ఞప్తి చేశారు.







