పర్చూరు, 2026-11-28
గ్రామాల సమగ్ర అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.
గ్రామాల సమగ్ర అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే తమ జెండా, ఎజెండా అని స్పష్టం చేశారు. ప్రజలు నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ గ్రామాల అభివృద్ధిలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
నూతనంగా ఎన్నికైన పెద్దగంజాం, అనంతవరం, దుద్దుకూరు, స్వర్ణ గ్రామాలకు చెందిన పలువురు సర్పంచులు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులతో ఎమ్మెల్యే ఏలూరి సమావేశమై గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పలువురు నూతన సర్పంచులు, వార్డు సభ్యులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
అభివృద్ధికి ప్రాధాన్యత
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని, తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, వీధి దీపాలు వంటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ పర్చూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే ఏలూరి పిలుపునిచ్చారు.







