చీరాల, 19 November
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వందేమాతరం గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమెన్స్ డిగ్రీ కళాశాల లెక్చరర్ డాక్టర్ కె. సుజాత హాజరుకాగా, విశిష్ట అతిథులుగా యోగా గురువు ద్రాక్షాయణి, రచయిత్రి ఎన్.వి.ఎస్. లలిత శ్రీనివాస్, విశ్రాంత న్యాయశాఖ ఉద్యోగి మునిరుల్లా ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కె. సుజాత మాట్లాడుతూ, ఇందిరాగాంధీ దృఢమైన నిర్ణయాలు, సావిత్రిబాయి పూలే చేసిన త్యాగాలు నేటి మహిళలకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆమె సూచించారు.
రచయిత్రి లలిత శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులు ప్రతిరోజూ గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనాన్ని మంచి అలవాటుగా మార్చుకోవాలని, తద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగవచ్చని తెలిపారు. విశ్రాంత న్యాయశాఖ ఉద్యోగి మునిరుల్లా ఖాన్ మాట్లాడుతూ, ఇందిరాగాంధీ ధైర్యసాహసాలను, ముఖ్యంగా బంగ్లాదేశ్ విమోచన సమయంలో ఆమె చూపిన నాయకత్వ పటిమను వివరించారు. యోగా గురువు ద్రాక్షాయణి మాట్లాడుతూ, క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ద్వారా విద్యార్థుల్లో అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముంతావారి సెంటర్లోని శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన 17 మంది విద్యార్థులు, ఉమెన్స్ డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ప్రసంగించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ వేడుకలో మొత్తం 49 మంది పాల్గొన్నారు. చివరగా గ్రంథపాలకుడు ఎ. ప్రసాద్ అతిథులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది.



