క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-24
ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడటమే నిజమైన గొప్పతనమని జనసేన పార్టీ నాయకులు గునుకుల కిషోర్ అన్నారు. ప్రొఫెసర్ టైటస్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితులకు ఉచితంగా ప్రోటీన్, పోషకాహారం అందించే సేవా కార్యక్రమం కొండాయపాలెం గేటు సమీపంలోని ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్, కార్పొరేటర్ విజయలక్ష్మి పాల్గొని బాధితులకు పోషకాహారాన్ని అందించారు.
సమాజంలో ఆస్తులు సంపాదించడం కంటే, ఆపదలో ఉన్న మరో మనిషికి అండగా నిలిచే మంచి మనసు కలిగి ఉండటమే నిజమైన గొప్పతనమని జనసేన పార్టీ నాయకులు గునుకుల కిషోర్ అన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు కొండాయపాలెం గేటు సమీపంలోని ఆడిటోరియంలో ప్రొఫెసర్ టైటస్ నిర్మల్ కుమార్ గారి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితులకు ఉచితంగా ప్రోటీన్, పోషకాహారం అందించే సేవా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెలా నిరంతరంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్, 21వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి విజయలక్ష్మి గునుకుల పాల్గొని బాధితులకు పోషకాహారాన్ని అందించారు.
ఈ సందర్భంగా కిషోర్ గునుకుల మాట్లాడుతూ, ప్రొఫెసర్ టైటస్ నిర్మల్ కుమార్ తనకు కేవలం పరిచయస్తులు మాత్రమే కాదని, విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు జీవితంలో మంచి మార్గాన్ని చూపించిన గురువని భావోద్వేగంగా పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే సేవా భావాన్ని, సామాజిక బాధ్యతను అలవర్చుకుని సమాజంలోని అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న గొప్ప వ్యక్తి నిర్మల్ కుమార్ గారని కొనియాడారు. ఆయన సేవా ప్రయాణం కోవిడ్ సమయంలో ప్రారంభమైనది కాదని, కోవిడ్‌కు ముందు నుంచే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, కోవిడ్ సమయంలోనూ, ఆ తర్వాత కూడా ఎలాంటి విరామం లేకుండా సేవలను కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రతి నెలా క్యాన్సర్ బాధితులకు ఉచితంగా ప్రోటీన్, పోషకాహారం అందించడం వెనుక ఉన్నది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, బాధితుల పట్ల ప్రేమ, మానవత్వం, నిరంతర బాధ్యతాభావమని అన్నారు.
క్యాన్సర్ అంటే జీవితానికి ముగింపు కాదు ధైర్యంగా పోరాడాలి
క్యాన్సర్ బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ, క్యాన్సర్ వ్యాధి వచ్చిందని ఎవరూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, సరైన సమయంలో వ్యాధిని గుర్తించి వైద్యుల సూచనలతో చికిత్స పొందడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఆనం రామనారాయణ సోదరి వల్లి మాట్లాడుతూ...తన కుటుంబంలో క్యాన్సర్‌తో బాధపడిన ముగ్గురు మహిళలు సైతం సరైన సమయంలో వైద్య చికిత్స పొందుతూ 80 సంవత్సరాలకు పైగా, దాదాపు 100 సంవత్సరాల వరకు జీవించిన అనుభవాన్ని పంచుకున్నారు. క్యాన్సర్ అంటే జీవితానికి ముగింపు కాదని, వైద్య చికిత్సతో పాటు ఆత్మవిశ్వాసం, కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
వైద్య సదుపాయాలు, పోషకాహారంపై అవగాహన
ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్యాన్సర్ సర్జికల్ స్పెషలిస్ట్ డాక్టర్ నాగేశ్వరరావు గారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన రోగులకు అందుబాటులో ఉన్న క్యాన్సర్ చికిత్సా సదుపాయాల గురించి వివరించారు. డైటీషియన్ నిర్మల్ కుమార్ గారు క్యాన్సర్ బాధితులకు అవసరమైన పోషకాహారం, వైద్య సహాయాన్ని మరింత చేరువ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. క్యాన్సర్ కోఆర్డినేటర్ కన్యాకుమారి గారు బాధితులకు అందుబాటులో ఉన్న సేవలను వినియోగించుకోవాలని, అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.


