ఒంగోలు, 2026-11-28
ఒంగోలులోని శక్తి సదన్‌లో ఆశ్రయం పొందుతున్న మహిళలకు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి భరోసా కల్పించి, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు.
జీవితంలో ఎదురయ్యే సమస్యలకు కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో భవిష్యత్తులో ముందుకు సాగాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మహిళలకు సూచించారు. శనివారం ఒంగోలు పట్టణంలోని కొత్త డంక వద్ద ఉన్న శక్తి సదన్‌ను జాయింట్ కలెక్టర్ సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న మహిళలతో ఆమె వ్యక్తిగతంగా మాట్లాడి, వారి సమస్యలు, కష్టాలు, పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరితో విడివిడిగా చర్చించి, వారి అనుభవాలను తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎలా ముందుకు సాగాలనే అంశంపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా మహిళలకు ఆత్మస్థైర్యాన్ని నింపిన జాయింట్ కలెక్టర్, ఎవరూ నిరాశకు లోనుకావద్దని, జీవితంలో ఎదురైన ఇబ్బందులను అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. భవిష్యత్తు జీవితానికి సంబంధించి సరైన ప్రణాళికలు రూపొందించుకుని, వాటిని ఆచరణలో పెట్టే దిశగా కృషి చేయాలని తెలిపారు.
జాయింట్ కలెక్టర్ తమతో ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పడంపై, శక్తి సదన్‌లో ఆశ్రయం పొందుతున్న మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఆమె ఇచ్చిన సూచనలు, సలహాలను పాటిస్తూ భవిష్యత్తులో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శక్తి సదన్ అధ్యక్షురాలు, కోశాధికారి అరుణ తదితరులు పాల్గొన్నారు.







