ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొలం పనులు ముగించుకుని కూలీలను ఇంటికి చేరుస్తున్న రైతు, నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామ సమీపంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గోకరాజుపల్లి గ్రామానికి చెందిన మొల్లెంపూడి మహేష్ (45) అనే రైతు, కొణతాలపల్లి గ్రామ పరిధిలో సాగు చేస్తున్న పుల్ల శనగ పంట పనులు చూసుకుంటున్నారు.
పంట కోత దశకు చేరుకోవడంతో, కూలీలను తీసుకువచ్చి పనులు చేయిస్తున్నారు. రోజువారీ పనులు ముగిసిన అనంతరం, కూలీలను ట్రాక్టర్లో జుజ్జూరు గ్రామానికి తరలించి, వారిని దింపిన తర్వాత తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఎన్ఎస్పీ కాల్వ సమీపంలో జరుగుతున్న రహదారి మరమ్మతుల కారణంగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ట్రాక్టర్ కింద చిక్కుకున్న మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.


