డిసిసి (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 23
పార్వతీపురం మున్సిపాలిటీలో నెలకొన్న తాగునీరు, వీధిలైట్లు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ సమస్యలతో పాటు ఆక్రమణలు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై కొత్తగా కొలువుదీరిన కౌన్సిల్ దృష్టి సారించాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. నూతన కౌన్సిల్‌కు వారు శుభాకాంక్షలు తెలిపారు.
కొత్తగా కొలువుదీరిన పార్వతీపురం మున్సిపల్ కౌన్సిల్ పట్టణ సమస్యలపై దృష్టి సారించాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. సోమవారం పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసిన నూతన కౌన్సిల్‌కు కాంగ్రెస్ పార్టీ డిసిసి జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు, లీగల్ సెల్ అధ్యక్షులు కోలా కిరణ్ కుమార్, స్పోర్ట్స్ సెల్ అధ్యక్షులు గంట మోహన్ రావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ బెళగాం కరుణకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా మున్సిపాలిటీ నిరాదరణకు గురైందని, దీంతో అనేక సమస్యలు వేధిస్తున్నాయని అన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా తాగునీరు, వీధిలైట్లు, పారిశుద్ధ్యం, దోమల బెడద, డంపింగ్ యార్డ్ వంటి సమస్యలు మున్సిపాలిటీని పట్టిపీడిస్తున్నాయని తెలిపారు. మెయిన్ రోడ్డు కబ్జాకు గురికావడంతో ట్రాఫిక్ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు.
మున్సిపాలిటీలోని పలు చెరువులు, వరహాల గెడ్డ ఆక్రమణలకు గురయ్యాయని, ఆక్రమణలు తొలగింపునకు చర్యలు చేపట్టాలని సూచించారు. మురుగు కాలువలు, రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని, ఏమాత్రం వర్షం పడినా చెరువుగా మారుతున్న పట్టణ మెయిన్ రోడ్డు సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గత కౌన్సిల్ కాలంతోపాటు ప్రత్యేక అధికారుల కాలంలో మున్సిపల్ నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు ఉన్నాయని, వాటిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా నూతన కౌన్సిల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.







