క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-22
చిలకలూరిపేట మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని, ఎన్నికల్లో గెలుపుతో పాటు బాధ్యతలను గుర్తుంచుకోవాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.
ప్రజలు మీకు అందించింది కేవలం గెలుపు కాదని, వారి సంక్షేమం, సమస్యల పరిష్కారం, పట్టణాభివృద్ధికి సంబంధించిన కీలక బాధ్యతను మీపై ఉంచారనే వాస్తవాన్ని కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు గుర్తుంచుకోవాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త పాలకవర్గం ఆత్మీయ సమావేశం ఆదివారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రత్తిపాటి, నూతన సభ్యులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పట్టణ మున్సిపాలిటీ నూతన కార్యవర్గానికి పలు కీలక సూచనలు చేశారు.
సోమవారం కొత్త పాలకవర్గం ప్రమాణస్వీకారం జరుగుతుందని, రేపటి నుంచే చిలకలూరిపేట మున్సిపాలిటీలో నూతన పాలనకు, సరికొత్త అభివృద్ధి అధ్యాయానికి బీజం పడనుందని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. నూతన పాలకవర్గం ప్రజలతో మమేకమయ్యే విధానం, సభ్యుల పనితీరే 2029 ఎన్నికల్లో కూటమికి తిరుగులేని విజయాన్ని అందించాలన్నారు.
మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవికి ఆశావహులు ఎక్కువగా ఉన్నారని, ఆ నిర్ణయం పార్టీ అధిష్టానం పరిధిలో ఉందని, టీడీపీ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని ప్రత్తిపాటి ఈ సందర్భంగా నూతన కౌన్సిలర్లకు సూచించారు. ప్రతి కౌన్సిలర్ తనను తాను ప్రజా సేవకుడిగా భావించాలని, ప్రజా సమస్యల పరిష్కారం, పట్టణ ప్రగతిలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి విషయంలో తాను కఠినంగానే వ్యవహరిస్తానని ప్రత్తిపాటి సుతిమెత్తగా హెచ్చరించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి అభిమానం పొందేవారికి రాజకీయంగా మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. కూటమిపార్టీలపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ నిలబెట్టుకోవాలని ప్రత్తిపాటి సూచించారు.
నూతన పాలకవర్గం పార్టీలు, వర్గాలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, విభేదాలను పక్కన పెట్టి, ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు పోటీ పడాలని ప్రత్తిపాటి సూచించారు.
ఈ సమావేశంలో చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమతి తోట రాజరాజేశ్వరి గారు, మున్సిపల్ కౌన్సిలర్స్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.







