చిలకలూరిపేట, 2026-11-28
దేశంలో సామాజిక సంస్కరణలకు బలమైన పునాది వేసిన మహాత్మా జ్యోతిరావు పూలే భావజాలం, ఆలోచనలు నేటికీ ప్రజలను చైతన్యపరుస్తున్నాయని, ఆయన చూపిన మార్గంలో ఎందరో సామాజిక సేవకులు, సంఘ సంస్కర్తలు ప్రజాహితం కోసం సేవలు అందించారని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.
దేశంలో సామాజిక సంస్కరణలకు బలమైన పునాది వేసిన మహాత్మా జ్యోతిరావు పూలే భావజాలం, ఆలోచనలు నేటికీ ప్రజలను చైతన్యపరుస్తున్నాయని, ఆయన చూపిన మార్గంలో తరువాత ఎందరో సామాజిక సేవకులు, సంఘ సంస్కర్తలు ప్రజాహితం కోసం తమవంతు సేవలు అందించారని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి కార్యక్రమంలో ప్రత్తిపాటి పాల్గొన్నారు. నియోజకవర్గ టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే వర్థంతి వేడుకకు హాజరైన ప్రత్తిపాటి, ఈ సందర్భంగా ఆ మహానీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రత్తిపాటి మాట్లాడారు.
కులరహిత సమాజం, మహిళా సాధికారత, అందరికీ సమాన విద్య, సామాజిక న్యాయాన్ని మహాత్మా జ్యోతిరాపు పూలే తన జీవితాశయాలుగా భావించారని ప్రత్తిపాటి కొనియాడారు. మహిళా విద్య, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, రైతు సంక్షేమం, సామాజిక సమానత్వం కోసం ఆయన సాగించిన పోరాటాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, సామాజిక అసమానతలు తగ్గుతాయని భావించిన పూలే, 1848లోనే బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించారని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాన్ని నిజం చేసేందుకు ఆయన జీవిత భాగస్వామి, సావిత్రి భాయ్ పూలే తీవ్రంగా శ్రమించారు. భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందిన సావిత్రి భాయ్ పూలే మహిళా విద్య కోసం విశేష కృషి చేశారని ప్రత్తిపాటి ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త కుమారి, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, ముల్లా కరిముల్లా, షేక్ మస్తాన్ వలి, కొత్త కోటేశ్వరరావు, తన్నీరు పుల్లారావు, తుపాకుల అప్పారావు, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.







