చీరాల, 04.08.2026
బాపట్ల జిల్లా, చీరాల: బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, చీరాల డిఎస్పీ ఎమ్.డి. మోయిన్ సూచనల మేరకు, చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం మంగళవారం శ్రీ మేధావి జూనియర్ కళాశాల విద్యార్థినులకు శక్తి యాప్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థినుల భద్రత, వేధింపులను ఎదుర్కోవడం వంటి అంశాలపై దృష్టి సారించారు.
బాపట్ల జిల్లా, చీరాల: బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, చీరాల డిఎస్పీ ఎమ్.డి. మోయిన్ సూచనల మేరకు, చీరాల సిఐ సోమశేఖర్, ఎస్సై హరిబాబు ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ 'శక్తి బృందం' మంగళవారం శ్రీ మేధావి జూనియర్ కళాశాల విద్యార్థినులకు 'శక్తి యాప్' వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
శక్తి టీం కానిస్టేబుల్ కె. సుబ్బారావు, కళాశాల కరస్పాండెంట్ ఎంవి దుర్గాకుమార్, ప్రిన్సిపాల్ సత్యనారాయణ, కళాశాల ఏవో అవినాష్, వైస్ ప్రిన్సిపల్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్సై ఏ హరిబాబు, కె. సుబ్బారావు మాట్లాడుతూ, కళాశాల విద్యార్థినుల పట్ల ఆకతాయిలు చేసే వేధింపులు వారి విద్యాభ్యాసం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. బస్టాప్‌లు, కళాశాల పరిసరాలు, ప్రజా ప్రదేశాలు, సామాజిక మాధ్యమాల్లో జరిగే ఈవ్‌టీజింగ్, అసభ్యకర వ్యాఖ్యలు, వెంటపడటం, బెదిరింపులు వంటి వేధింపులను సహించకూడదని విద్యార్థినులకు సూచించారు.
ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు వెంటనే 'శక్తి యాప్' (SOS) ద్వారా లేదా 112 నెంబరుకు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు కోరారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ మహిళల గౌరవాన్ని కాపాడే బాధ్యతను గుర్తించాలన్నారు. వేధింపులు లేని విద్యా వాతావరణాన్ని నిర్మించేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా, విద్యార్థినులు చదువుతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మరక్షణ నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలని సూచించారు. సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, చట్టాలపై అవగాహన పెంచుకుని తమ హక్కులను తెలుసుకోవడం ఎంతో అవసరమని వివరించారు.











