Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 17
బాపట్ల జిల్లాలో 'శక్తి టీం' మరోసారి తన సత్తా చాటింది. గొడవపడి చీరాలకు వచ్చిన ఓ భార్యను, ఆమె కోసం వెతుకులాడుతూ వచ్చిన భర్తతో కలపడంలో శక్తి టీం సభ్యులు కీలక పాత్ర పోషించారు. సీఐ సోమశేఖర్ పర్యవేక్షణలో జరిగిన ఈ ఘటనలో, మహిళా ఏఎస్ఐ శివకుమారి, కానిస్టేబుల్స్ సుబ్బారావు, సునీత పాల్గొన్నారు.
భార్యాభర్తలను కలిపి, వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో 'శక్తి టీం' కీలక పాత్ర పోషించింది. బాపట్ల జిల్లా ఐపీఎస్ అధికారి బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల సబ్ డివిజన్ డీఎస్పీ మోయిన్ మార్గదర్శకత్వంలో శక్తి టీం సభ్యులు ఈ ఘనత సాధించారు.
వివరాల్లోకి వెళితే, చీరాల రైల్వే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న శక్తి టీం సభ్యులు, విజయవాడకు చెందిన మేరీ, యోసోబు అనే దంపతుల సమస్యను పరిష్కరించారు. మేరీ, తన భర్త యోసోబుతో గొడవపడి, రెండు రోజుల క్రితం చెప్పకుండా రైలులో చీరాలకు వచ్చింది. యోసోబు తన భార్య కోసం వెతుకులాడుతూ చీరాలకు వచ్చి, రైల్వే స్టేషన్లో డ్యూటీలో ఉన్న శక్తి టీం సభ్యులకు జరిగిన విషయాన్ని వివరించారు.
సమాచారం అందుకున్న శక్తి టీం సభ్యులు, వెంటనే చీరాల 1 టౌన్ సీఐ సోమశేఖర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అనంతరం, ఉమెన్ ఏఎస్ఐ శివకుమారి, కానిస్టేబుల్స్ సుబ్బారావు, సునీత బృందంగా ఏర్పడి మేరీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో, ఫ్లైఓవర్ వద్ద, రైల్వే పాడుబడిన వాటర్స్ దగ్గర చెట్టు కింద మేరీ నిద్రిస్తున్నట్లు గుర్తించారు.
గుర్తించిన వెంటనే, ఆమెను సురక్షితంగా తీసుకొచ్చి, భర్త యోసోబుకు అప్పగించారు. అనంతరం, వారిద్దరినీ విజయవాడ వెళ్లే రైలు ఎక్కించి, సురక్షితంగా గమ్యస్థానానికి పంపించారు. తమను కలిపిన శక్తి టీం సభ్యులకు భార్యాభర్తలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా, శక్తి టీం సభ్యులను చీరాల 1 టౌన్ సీఐ సోమశేఖర్ అభినందించారు.











