Yadadri Bhuvanagiri/Atmakur (M) (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 17
దేశ వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసే అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయవద్దని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపునిచ్చింది. ఈ నెల 22న జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే ఈ ఒప్పందం జరుగుతోందని నాయకులు విమర్శించారు.
మన రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసి నాశనం చేసే అమెరికాతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయవద్దని, ఈనెల 22న జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా సమావేశం పిలుపునిచ్చింది. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కె.ఎం) పిలుపు మేరకు ఈ ఆందోళనలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
శుక్రవారం ఏలూరులోని అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా సమావేశం బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన రావు, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి కారం రాఘవ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస డాంగే తదితరులు పాల్గొన్నారు.
అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసేందుకు కేంద్ర మోడీ ప్రభుత్వం తహతహలాడుతోందని, ఇది కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమేనని నాయకులు విమర్శించారు. అమెరికా నుండి ఎటువంటి సుంకాలు లేకుండా పాలు, పాల పదార్థాలు, కోడి మాంసం, మొక్కజొన్నలు, పత్తి, సోయాబీన్, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి అయితే దేశీయంగా రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజల స్వయం సమృద్ధిని, సార్వభౌమాధికారాన్ని నాశనం చేసి ప్రపంచ కార్పొరేట్ సంస్థలకు, అమెరికా సామ్రాజ్యవాదానికి మోడీ ప్రభుత్వం లొంగిపోయి వ్యవహరించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
ఇప్పటికే దేశంలో రైతులు వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోయి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు పెట్టవద్దని డిమాండ్ చేశారు. ఒకవేళ సంతకాలు చేస్తే, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్.టి.ఎ)కు వ్యతిరేకంగా మరో చారిత్రాత్మక రైతు ఉద్యమానికి సమాయత్తం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈనెల 22న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలలో సంయుక్త కిసాన్ మోర్చాలోని భాగస్వామ్య సంఘాలతో పాటు జిల్లాలోని అన్ని పంటల రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 22వ తేదీ లోపు రాష్ట్రపతికి వినతి పత్రాలు పంపాలని, అదే రోజు మండల, జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశం నిర్ణయించింది.












