బాపట్ల జిల్లాలో రోంపేరు వరద కాలువ పునరుద్ధరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.26.50 కోట్ల పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. ఈ చర్యతో మూడు నియోజకవర్గాల పరిధిలోని 75 వేల ఎకరాలకు వరద ముప్పు తగ్లనుంది.
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృషితో రోంపేరు రైట్ ఆర్మ్ డ్రెయిన్‌ను కిలోమీటరు 30.450 నుంచి 37.600 వరకు సుమారు 6.500 కిలోమీటర్ల మేర డ్రెడ్జింగ్ చేయడానికి ఈ నిధులు కేటాయించారు. జలవనరుల శాఖ (ప్రాజెక్ట్స్–II) జారీ చేసిన జీఓ ఆర్టీ నెం.59 ద్వారా ఈ ఆమోదం లభించింది.
దీర్ఘకాలంగా కాలువలో సిల్ట్ పేరుకుపోవడం వల్ల నీటి ప్రవాహం మందగించి, వరద ముప్పు పెరిగింది. దీనివల్ల పంట పొలాలు నీట మునిగి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. డ్రెడ్జింగ్ పనులు పూర్తయితే నీటి ప్రవాహ సామర్థ్యం పెరిగి, వరద ఉధృతి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ పునరుద్ధరణ పనులు పూర్తయితే చిన్నగంజాం, పర్చూరు, మార్టూరు, యద్దనపూడి, ఇంకొల్లు, కారంచేడు, చీరాల, వేటపాలెం, బాపట్ల మండలాల పరిధిలోని 75 వేల ఎకరాల విస్తీర్ణంలోని పంట పొలాలకు రక్షణ కవచంగా నిలుస్తుంది. మొత్తం 7.500 కిలోమీటర్ల మేర ఆధునికీకరణ పనులు చేపట్టే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి.
ఈ నిధుల మంజూరులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కీలక పాత్ర పోషించారు. రోంపేరు డ్రెయిన్ సమస్యపై ఉన్నతాధికారులతో సమావేశమై, రైతుల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణా డెల్టా పరిధిలో కాల్వలు, డ్రెయిన్ల పునరుద్ధరణ అత్యవసరమని వివరిస్తూ సమగ్ర ప్రతిపాదనలు అందజేశారు.


