చీరాల, 2026-11-25
విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఇంటరాక్ట్ రీజినల్ చైర్మన్ మన్నే అనురాధ సూచించారు.
విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఇంటరాక్ట్ రీజినల్ చైర్మన్ మన్నే అనురాధ పిలుపునిచ్చారు. రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూరు సెంట్రల్ ఆధ్వర్యంలో బుధవారం చీరాలలోని ఆర్.కె. ఓరియంటల్ స్కూల్ ప్రాంగణంలో, ఆర్.కె. ఓరియంటల్ స్కూల్, ఎస్.ఏ.ఆర్.ఆర్.ఎం. హైస్కూల్ విద్యార్థులతో నూతనంగా ఏర్పాటు చేసిన రోటరీ అనుబంధ విద్యార్థి విభాగాలైన ఇంటరాక్ట్ క్లబ్స్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మన్నే అనురాధ మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని, చిన్నతనం నుంచే సేవాభావం, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. ఇంటరాక్ట్ క్లబ్స్ ద్వారా విద్యార్థులకు సమాజ సేవ పట్ల అవగాహన పెరగడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
అతిథుల ప్రసంగం
ఆత్మీయ అతిథులుగా పాల్గొన్న రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఐ. బాబురావు, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ కార్యదర్శి జయశ్రీ, విశ్రాంత ప్రిన్సిపాల్ బత్తుల బ్రహ్మారెడ్డి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు భవనం బద్రీరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థి దశ నుంచే సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ద్వారా సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగవచ్చని వారు తెలిపారు.
అనంతరం నూతనంగా ఏర్పాటైన ఇంటరాక్ట్ క్లబ్స్ కార్యవర్గ సభ్యులతో అతిథులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూరు సెంట్రల్ అధ్యక్షులు ఆరె గిరిధర రెడ్డి, కార్యదర్శి పాబోలు ఉదయభాస్కర్, రోటరీ క్లబ్ సభ్యులు, రెండు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







