బాపట్ల, 2026-06-30
ఓటర్ల జాబితా నవీకరణపై చేపట్టిన ఇంటింటా సర్వే ప్రక్రియను సమర్థంగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం అధికారి పన్వన్ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఢిల్లీ నుంచి ఎన్నికల సంఘం వీక్షణ సమావేశం నిర్వహించింది. బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో సర్వేను సమర్థంగా నిర్వహించాలని ఆయన సూచించారు.
ఓటర్ల జాబితా నవీకరణపై చేపట్టిన ఇంటింటా సర్వే ప్రక్రియను సమర్థంగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం అధికారి పన్వన్ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఢిల్లీ నుంచి భారత ఎన్నికల సంఘం వీక్షణ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో ఇంటింటా ఓటర్ల సర్వే ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని, సక్రమంగా పనిచేయని బిఎల్ఓల స్థానంలో వేరొకరిని నియమించాలని సూచించారు.
సర్వే ప్రక్రియ నాణ్యతా ప్రమాణాలతో ఉండాలని, ఓటర్ల మ్యాపింగ్లో పొరపాట్లు లేకుండా చూడాలని, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి జిల్లా నుంచి జిల్లా ప్రత్యేక అధికారిగా నియమితులైన పౌర సరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్ కన్నబాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి హాజరయ్యారు.
అనంతరం జిల్లాలో జరుగుతున్న సర్వే ప్రక్రియపై జిల్లా ప్రత్యేక అధికారి కన్నబాబుకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ నివేదిక అందజేశారు. జిల్లాలో 1,212 మంది బిఎల్ఓలు ఉన్నారని, 71.82 శాతం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, డిఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, ఆర్డీవో హరికుమార్, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు షేక్ షఫీ తదితరులు పాల్గొన్నారు.











