చీరాల పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కొనసాగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ నాయకులు ఓటర్లను కోరారు. చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో వైఎస్సార్సీపీ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ ఇస్తర్ల షెర్లి, 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ ఫాతిమా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వార్డులోని ఓటర్లను కలిసి పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
నాయకులు మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చీరాల మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి నాయకత్వంలో మున్సిపాలిటీకి నిధులు తీసుకువచ్చి, ప్రజలకు అవసరమైన పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
చీరాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడంతోపాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం వైఎస్సార్సీపీ లక్ష్యమని వివరించారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ విలువైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి, చైర్మన్ అభ్యర్థి డాక్టర్ ఇస్తర్ల షెర్లి, 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ ఫాతిమాలను గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.










