రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంటలు ఎండిపోకుండా రాత్రింబవళ్లు విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంటలు చేతికొచ్చే వరకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.
రాబోయే 20 రోజులు పంటలకు అత్యంత కీలకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ కొరత కారణంగా రైతులు పంట నష్టపోకూడదని ఆయన హెచ్చరించారు. వ్యవసాయానికి విద్యుత్ అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అందుకు అనుగుణంగా సరఫరా పెంచాలని సూచించారు.
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, విద్యుత్, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా ప్రస్తుత పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని పలుమార్లు ఆదేశించినా పరిస్థితిలో మార్పు ఎందుకు రావడం లేదని అధికారులను నిలదీశారు. రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నప్పటికీ, ఉత్పత్తిని పెంచేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
నైనీ, మహానది నుంచి బొగ్గు సరఫరాకు లింకేజీ ఏర్పాట్లు చేసినా, యాదాద్రి విద్యుత్ ప్లాంట్లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని ఆయన ఆరా తీశారు.
ముఖ్యమంత్రి తీవ్ర హెచ్చరిక
ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది నేను. రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితి మారలేదు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను సహించేది లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు అని ముఖ్యమంత్రి తీవ్రంగా హెచ్చరించారు.
అవసరమైతే విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్, జెన్కో సీఎండీ, సంబంధిత విభాగపు ఐఏఎస్ లను సస్పెండ్ చేస్తానని ఆయన మండిపడ్డారు. విద్యుత్ అంతరాయాలకు రోజుకో కారణం చెప్పవద్దని హెచ్చరించారు.
ఎల్నినోను కోవిడ్ తరహా విపత్తుగా పరిగణించాలి
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కోవిడ్ తరహా విపత్తుగా పరిగణించి, అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పుడు సాధారణ సమస్యగా కనిపిస్తున్న పరిస్థితులు, ముందస్తు చర్యలు చేపట్టకపోతే తీవ్ర సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ఎల్నినో కోవిడ్ లాంటి విపత్తు. ఈ పరిస్థితి ఎప్పటివరకు ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు సమస్యగా కనిపిస్తోంది. అప్రమత్తం కాకపోతే సంక్షోభంగా మారుతుంది. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో ఎల్నినో ప్రభావాన్ని లోతుగా అంచనా వేయాలి. సమస్యలను అధిగమించేందుకు పరిష్కార మార్గాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలి అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఈ పరిస్థితులు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేమని, మళ్లీ వానలు వచ్చే వరకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాల్సిందేనని ఆయన అన్నారు. వచ్చే జూన్ వరకు ప్రతి శాఖ పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. రాబోయే సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసి, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.











