ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ పై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సానుకూల స్పందన వ్యక్తం చేశారు. బడ్జెట్ లో అభివృద్ధి, సంక్షేమాలకు సమప్రాధాన్యత కల్పించారని ఆయన అన్నారు.
ఏపీ బడ్జెట్ లో విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించడం అభినందనీయమని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన స్పందించారు.
వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎత్తివేసిందని, కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించడం ఆ వర్గాల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుతోందని ఎంపీ పేర్కొన్నారు. బీసీ కాంపోనెంట్ కోసం రికార్డు స్థాయిలో 51,021 కోట్లు కేటాయించడం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంక్షేమ కేటాయింపులు పెంచడం సంతోషకరమని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులున్నా, ఇచ్చిన హామీని నెరవేర్చుతూ నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం ప్రకటించడం ముఖ్యమంత్రి చంద్రబాబు ధృఢ సంకల్పానికి నిదర్శనమని ఎంపీ తెలిపారు. గృహ నిర్మాణ శాఖకు 6,350 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు 13,546 కోట్లు కేటాయించడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
పోలవరంతో సహా నీటిపారుదల ప్రాజెక్టులకు 18,224 కోట్లు కేటాయించడం, రాజధాని అమరావతికి 6,000 కోట్లు కేటాయించడం ద్వారా పనులు వేగంగా పూర్తవుతాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచడంతోపాటు, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు 30 వేల కోట్ల నిధులు కేటాయించడం రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుందని అన్నారు.


