కమలాపురం మండలం కోగటం గ్రామం శివారులో నిలిపి ఉంచిన మూడు పాఠశాల బస్సులు అర్ధరాత్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో బస్సులు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
నిన్న రాత్రి సుమారు 12:30 గంటల సమయంలో కోగటం గ్రామం బయట నైట్ హాల్ట్ కొరకు పెట్టుకున్న మూడు పాఠశాల బస్సులలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు తీవ్రరూపం దాల్చడంతో బస్సులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. కమలాపురం పోలీసులు కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అయితే, అప్పటికే బస్సులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ప్రమాదానికి గురైన బస్సులలో గీతాంజలి హైస్కూల్ (బొల్లవరం), ఐడియల్ పబ్లిక్ స్కూల్ (ప్రొద్దుటూరు), మరియు గోపికృష్ణ మాంటెస్సోరి హైస్కూల్ (ప్రొద్దుటూరు) లకు చెందినవి ఉన్నాయి. కొన్ని బస్సుల నంబర్లు, యజమానులు, డ్రైవర్ల వివరాలు సేకరించినట్లు సమాచారం.
ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మంటలు ఎలా చెలరేగాయి, దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని తెలిసింది. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.








