Bapatla/Bapatla (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 14
కారంచేడు మారణకాండ అనంతరం బాధితులకు అండగా నిలిచి, దళిత ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నాయకుడు కోటి జేమ్స్ సేవలను దళిత నాయకులు స్మరించుకున్నారు. చీరాల శాంతినగర్‌లోని బ్రదరన్ చర్చి వద్ద మంగళవారం నిర్వహించిన స్మారక కార్యక్రమంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
కారంచేడు మారణకాండ అనంతరం బాధితులకు అండగా నిలిచి, దళిత ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నాయకుడు కోటి జేమ్స్ సేవలను దళిత నాయకులు స్మరించుకున్నారు. చీరాల శాంతినగర్‌లోని బ్రదరన్ చర్చి వద్ద మంగళవారం నిర్వహించిన స్మారక కార్యక్రమంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్ర మాట్లాడుతూ, 1985 జూలై 17న జరిగిన కారంచేడు మారణకాండ అనంతరం బాధితులకు అండగా నిలిచి, దళిత ఉద్యమాన్ని నిర్మించడంలో కోటి జేమ్స్, కత్తి పద్మారావుతో కలిసి విశేష కృషి చేశారని తెలిపారు. చీరాలలోని 18 మాలపేటలను ఏకం చేసి, "పూటకో పేట" నినాదంతో కారంచేడు బాధితులకు భోజన సదుపాయాలు కల్పించడంతో పాటు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో ఆయన ముందుండేవారని గుర్తు చేశారు. కారంచేడు బాధితుల శిబిరానికి రక్షణగా నిలిచి, విజయనగర్ కాలనీ ఏర్పాటు, బాధితులకు ఉద్యోగాల కల్పన, కారంచేడు కేసులో న్యాయపోరాటం వంటి అంశాల్లో కోటి జేమ్స్ కీలక వ్యూహాత్మక పాత్ర పోషించారని అన్నారు. బాధితుల కమిటీ తరపున తేళ్ల జడ్సన్, దుడ్డు భాస్కరరావు తదితరులతో కలిసి ఆయన సుదీర్ఘ పోరాటాన్ని కొనసాగించారని పేర్కొన్నారు.
దళిత ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు వివిధ రాజకీయ పార్టీలు చేసిన ప్రయత్నాలను కత్తి పద్మారావుతో కలిసి సమర్థంగా తిప్పికొట్టారని, ఉద్యమాన్ని తన లక్ష్యం నుంచి దారి మళ్లకుండా కాపాడడంలో కోటి జేమ్స్ అంకితభావంతో పనిచేశారని నీలం నాగేంద్ర కొనియాడారు. అనంతరం పాస్టర్‌గా సేవలందించినప్పటికీ, ఆయన పోరాటస్ఫూర్తి, ఉద్యమ వ్యూహాలు దళిత సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ స్మారక కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్, దళిత మహిళా అధ్యక్షురాలు బి.ఎం. లీలాకుమారి, దళిత విప్లవ సేన కన్వీనర్ క్రాంతి, దుడ్డు భాస్కరరావు, లక్ష్మీనరసయ్య, మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకటరావు, హైకోర్టు న్యాయవాది సురేష్, కంతేరు సాంబయ్య, దళిత మహాసభ అధ్యక్షుడు జూలియన్, దారా అంజయ్య, కాకుమాను రవి తదితరులు పాల్గొని కోటి జేమ్స్‌కు నివాళులర్పించారు.











