మహాకవి గురజాడ వెంకట అప్పారావు గారి జయంతిని పురస్కరించుకుని కొడవలివారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రచనల ద్వారా సమాజానికి అందించిన స్ఫూర్తిని విద్యార్థులకు వివరించారు.
పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో, తెలుగు ఉపాధ్యాయిని ఎస్.రామాంజనీదేవి విద్యార్థులకు గురజాడ అప్పారావు గారి సాహిత్య కృషిని పరిచయం చేశారు. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ వంటి ఆయన భావనలు దేశభక్తితో పాటు మానవతా విలువలను ఎలా పెంపొందిస్తాయో వివరించారు.
అంతేకాకుండా, బాల్యవివాహాలు, కన్యాశుల్కం, స్త్రీలపై వివక్ష వంటి సామాజిక దురాచారాలను గురజాడ తన రచనల ద్వారా ఎలా ప్రశ్నించారో, సమాజంలో మార్పునకు ఎలా దోహదపడ్డారో ఆమె తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఏ. ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ, ఆధునిక తెలుగు సాహిత్యానికి గురజాడ వెంకట అప్పారావు చేసిన సేవలను కొనియాడారు. ఆయన రచనలు నేటికీ ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.


