పెండ్లిమర్రి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షల విధుల్లో ఉన్న అబ్జర్వర్ పై దాడి చేసిన ప్రిన్సిపల్ ఇందిర పై ఎస్.సి, ఎస్.టి అట్రాసిటీ కేసు నమోదు చేసి, వెంటనే సస్పెండ్ చేయాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి), ప్రగతిశీల విద్యార్థి సంఘం (పి.ఎస్.యూ) నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు వారు ఇంటర్మీడియట్ విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్.జే.డి) కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్, పి.ఎస్.యూ జిల్లా కార్యదర్శి ధార గోపి మాట్లాడుతూ, కళాశాలలో డిపార్ట్ మెంట్ అబ్జర్వర్ గా విధులు నిర్వహిస్తున్న భూత లింగేశ్వర రావు గారిపై ప్రిన్సిపల్ ఇందిర దాడి చేయడంతో పాటు కులం పేరుతో దూషించడం దారుణమని అన్నారు.
పరీక్షల విధుల్లో ఉన్న అబ్జర్వర్ ఎస్.టి కులానికి చెందిన వారని, అందుకు గాను అగ్రవర్ణాలకు చెందిన ప్రిన్సిపల్ ఇందిర దాడి చేయడం హేయమైన చర్య అని వారు అభిప్రాయపడ్డారు. దాడి జరిగి పది రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రిన్సిపల్ పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమని వారు తెలిపారు. అధికారులు ప్రిన్సిపల్ కు వత్తాసు పలుకుతూ ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
గతంలో కూడా ప్రిన్సిపల్ ఇందిర కళాశాలలో లెక్చరర్లు, విద్యార్థులపై దాడి చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయని, అయినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రిన్సిపల్ ఇందిర ను సస్పెండ్ చేసి, ఎస్.సి, ఎస్.టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు సుమంత్, అంజి, పండు, చైతు, నాని, చింటూ లు పాల్గొన్నారు.


