మండలం కొల్లూరుపాడు గ్రామంలో పోషణ మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బీసీ కాలనీలో కే. రమాదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గర్భిణీలు, తల్లులకు పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
అంగన్వాడీ కేంద్రంలో అందించే బాలామృతం, బాలసంజీవని కిట్లు, ప్రోటీన్ ఫుడ్స్, పాలు, గుడ్లు, ఆకుకూరల వంటి వాటి గురించి వివరించారు. వివిధ రంగుల కూరగాయలు, పండ్ల పోషక విలువలను, ముఖ్యంగా ఆకుపచ్చని ఆకుకూరలు, తెలుపు రంగులో ఉండే పాలు, గుడ్లు, క్యారెట్ వంటి వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. ఆరు నెలలు నిండిన శిశువులకు ఇవ్వాల్సిన ఆహారం, ఇమ్యునైజేషన్ ప్రాముఖ్యత, ప్రధానమంత్రి మాతృత్వ వందన పథకం, అంగన్వాడీ కేంద్రంలో లభించే ఆహార పదార్థాల గురించి వివరించారు. పిల్లలకు సమతుల్యమైన ఆహారాన్ని వివిధ రకాలుగా ఎలా అందించాలి, మాంసాహారం, శాఖాహారం ఏ నెలలో, ఎంత పరిమాణంలో ఇవ్వాలనే విషయాలపై తల్లులకు అవగాహన కల్పించారు. అధిక చక్కెర, ఉప్పు, నూనెల వాడకం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను వివరించారు. గర్భధారణ సమయం నుంచి బిడ్డ రెండేళ్లు పూర్తయ్యే వరకు, అంటే వెయ్యి రోజుల పాటు తల్లి బిడ్డల సంరక్షణ ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ కార్యకర్త అమ్మనబ్రోలు సావిత్రి, సహాయకురాలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పిల్లల తల్లులు అందరూ కలిసి విజయవంతంగా నిర్వహించారు.












