అన్నమయ్య, 2026-11-20
విద్యార్థులను క్రమశిక్షణ కలిగిన, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో స్కౌటింగ్ కీలకమని సమగ్ర శిక్ష అన్నమయ్య జిల్లా ఏపీసీ డాక్టర్ అనురాధ తెలిపారు.
విద్యార్థులను క్రమశిక్షణ కలిగిన, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కీలక పాత్ర పోషిస్తోందని సమగ్ర శిక్ష అన్నమయ్య జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (ఏపీసీ) డాక్టర్ అనురాధ అన్నారు. మదనపల్లెలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో అన్నమయ్య జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్కౌట్ మాస్టర్లకు నిర్వహిస్తున్న బేసిక్, అడ్వాన్స్డ్ శిక్షణా శిబిరాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. శిక్షణలో భాగంగా నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స, వివిధ రకాల బ్యాండేజీలు కట్టడం, తాళ్లతో వివిధ రకాల ముడులు వేయడం, పయోనీరింగ్ నిర్మాణాలు వంటి ప్రాక్టికల్ శిక్షణా కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనురాధ మాట్లాడుతూ, స్కౌట్ మాస్టర్లు, యూనిట్ లీడర్లు విద్యార్థులకు ఆదర్శంగా నిలిచేలా రోల్ మోడల్స్‌గా ఎదగాలని సూచించారు. స్కౌటింగ్ ద్వారా విద్యార్థుల్లో సేవాభావం, సమయపాలన, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందుతాయని ఆమె పేర్కొన్నారు.
శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ, మరింత మంది విద్యార్థులను స్కౌటింగ్ ఉద్యమంలో భాగస్వాములను చేయాలని ఆమె సూచించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి స్కౌటింగ్ ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి, లీడర్ ట్రైనర్లు కమల్ కన్నన్, కొలిశెట్టి శివప్రసాద్, వెంకటేశ్వర్లు, జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ చంద్రశేఖర్, జిల్లా హెడ్‌క్వార్టర్స్ కమిషనర్ హర్షవర్ధన్ రెడ్డి, రిసోర్స్ పర్సన్లు మోహన్ బాబు, ప్రసాద్, మహమ్మద్ ఖాన్ పాల్గొన్నారు.







