నంద్యాల, 2026-11-28
నంద్యాల జిల్లాలోని ఆర్జియం ఇంటర్నేషనల్ స్కూల్లో 12వ వార్షిక క్రీడా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒలింపిక్ టార్చ్ వెలిగించి ప్రిన్సిపల్ గాయత్రి క్రీడా పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి చదువుతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమన్నారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, పట్టుదల, జట్టుగా పనిచేసే తత్వాన్ని అలవర్చుతాయని తెలిపారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
క్రీడా పోటీల్లో భాగంగా విద్యార్థులను అక్షయ, మహిమ, ఉజ్వల, సాధన పేర్లతో నాలుగు హౌస్లుగా విభజించారు. వివిధ అథ్లెటిక్స్, గ్రూప్ గేమ్స్ నిర్వహించారు. నాలుగు హౌస్ల మధ్య పోటీలు హోరాహోరీగా సాగాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిమ హౌస్ 404 పాయింట్లు సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
అనంతరం విజేతలకు ప్రిన్సిపల్ గాయత్రి ట్రోఫీలు, మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







