క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-21
బాపట్ల పురపాలక ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది.
బాపట్ల పురపాలక ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ శనివారం పట్టణంలోని 27వ వార్డులో పర్యటించి స్వతంత్ర ప్యానల్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఆయన పర్యటనకు స్థానికుల నుంచి ఆత్మీయ స్వాగతం లభించడంతో వార్డులో ఎన్నికల సందడి నెలకొంది. 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా స్వతంత్రంగా గ్యాస్ సిలిండర్ గుర్తుపై పోటీ చేస్తున్న మాసా సుజాతకు మద్దతుగా అన్నం సతీష్ ప్రభాకర్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రతి వీధిలో ఓటర్లను కలుసుకుంటూ మాసా సుజాతను గెలిపించాలని కోరారు. వార్డు అభివృద్ధికి కృషి చేసే నాయకురాలిగా ఆమెకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే చైర్మన్ అభ్యర్థి పేర్లి సునీల్ కుమార్ కప్పుసాసర్ గుర్తుపై పోటీ చేస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించారు. ప్రచారంలో భాగంగా అన్నం సతీష్ ప్రభాకర్ ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల మహిళలు హారతులు ఇచ్చి, పూలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆయన పర్యటనతో స్వతంత్ర ప్యానల్ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా మాసా సుజాత మాట్లాడుతూ 27వ వార్డులో తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, అంతర్గత రహదారుల వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. అన్నం సతీష్ ప్రభాకర్ మద్దతుతో మాసా సుజాత ప్రచారం ముమ్మరం కావడంతో 27వ వార్డులో పురపాలక ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.







