లక్ష్యంతో (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 21
బాపట్ల కలెక్టరేట్లో ఉద్యోగుల పఠనాసక్తిని పెంచేందుకు, విజ్ఞానాన్ని అందరికీ అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి 90 పుస్తకాలు విరాళంగా అందాయి.
బాపట్ల కలెక్టరేట్ ఉద్యోగుల్లో పఠనాసక్తిని పెంపొందించి, విజ్ఞానాన్ని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చొరవతో ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి శనివారం 90 పుస్తకాలు విరాళంగా అందాయి. బత్తుల వెంకటసుబ్బమ్మ అండ్ కృష్ణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ బి. శరత్ బోస్ 18 పుస్తకాలను అందజేశారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గురజాల శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ ఎం. జ్యోతిర్మయి, సభ్యులు డాక్టర్ ఐ. శ్రీనివాసరావు 22 పుస్తకాలను బహూకరించారు. మార్టూరులోని వివేకానంద నెక్స్ట్ జనరేషన్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ వేలూరి కృష్ణమూర్తి మరో 50 పుస్తకాలను అందించారు. మొత్తం 90 పుస్తకాలను దాతలు జిల్లా కలెక్టర్కు అందజేశారు. మానవత సంస్థ అధ్యక్షులు గురజాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన పుస్తకాలు పాఠకుల విజ్ఞానాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. కలెక్టర్ చొరవతో కలెక్టరేట్లో గ్రంథాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని, దాని అభివృద్ధికి తమ సంస్థ సహకారం కొనసాగిస్తామని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పుస్తకాలు అందించిన దాతలను అభినందించారు. పుస్తక పఠనం వ్యక్తిగత విజ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని కలెక్టర్ అన్నారు. ఉద్యోగులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని నిరంతరం జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యాదానం అన్నింటికంటే గొప్పదనే భావనతో, పుస్తక జ్ఞానాన్ని పదిమందికి పంచాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం కలెక్టరేట్ గ్రంథాలయాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు దోహదపడనుంది.







