ప్రకాశం, 2026-04-26
ప్రకాశం జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల (సీఆర్టీ) బదిలీల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. బదిలీల ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలు, న్యాయస్థానాల ఉత్తర్వులు ఉల్లంఘించారని, ఉపాధ్యాయులను మానసికంగా వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రకాశం జిల్లా ఏపీసీ (ఎస్ఎస్ఏ) దాసరి అనిల్ కుమార్‌పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది.
ప్రకాశం జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల (సీఆర్టీ) బదిలీల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. బదిలీల ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలు, న్యాయస్థానాల ఉత్తర్వులు ఉల్లంఘించారని, ఉపాధ్యాయులను మానసికంగా వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రకాశం జిల్లా ఏపీసీ (ఎస్ఎస్ఏ) దాసరి అనిల్ కుమార్‌పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, ఏపీసీగా దాసరి అనిల్ కుమార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కేజీబీవీ ఉపాధ్యాయులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే బదిలీలకు సంబంధించి షెడ్యూల్ రూపొందించి అమలు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, 26-04-2026న కేజీబీవీ సీఆర్టీ టీచర్స్ యూనియన్ ప్రతినిధులు ఏపీసీ, ఎస్‌పీడీలకు వినతిపత్రం అందజేసి, సీఆర్టీలకు ఎంటీఎస్ కల్పించిన అనంతరం బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.
అయితే, ఉపాధ్యాయులు వినతిపత్రంలో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా బదిలీలు చేపట్టడంతో కొందరు ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, రిట్ పిటిషన్ నంబర్ 13373/2026లో బదిలీలను రద్దు చేస్తూ, 26-04-2026న సమర్పించిన వినతిపత్రంలోని అంశాలను రెండు నెలల్లో అమలు చేయాలని 08-05-2026న ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. అయినప్పటికీ, కోర్టును ఆశ్రయించిన ఉపాధ్యాయులపై ఏపీసీ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. కేజీబీవీ ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు రత్నమాలికి దాదాపు నాలుగు నెలలపాటు జీతం చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల మధ్య గ్రూపులు సృష్టించి విభేదాలు పెంచడంతో పాటు, తనకు అనుకూలంగా ఉన్నవారితో బదిలీల కోసం అభ్యర్థన లేఖలు ఇప్పించారని ఆరోపించారు. ఎస్పీడీ ఉత్తర్వుల మేరకు బదిలీల నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని, ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా బదిలీ కావాల్సిందేనంటూ 11-09-2026న బదిలీలు చేపట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ముగ్గురు ఉర్దూ ఉపాధ్యాయులను ఒకే రోజు బదిలీ చేయలేదని, 100 శాతం వైకల్యం ఉన్న ఉపాధ్యాయులు, పదవీ విరమణకు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉన్నవారిని బదిలీ చేయకూడదనే నిబంధనలను సైతం ఉల్లంఘించారని ఆరోపించారు.
బదిలీల్లో కొందరికి అనుకూలమైన స్థానాలు కేటాయించి, మిగిలిన ఉపాధ్యాయులకు వారు కోరుకున్న ప్రాంతాలు కేటాయించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదుదారులు తెలిపారు. కోర్టు ఉత్తర్వులు పొందిన ఉపాధ్యాయులు పనిచేస్తున్న కేజీబీవీలను తనిఖీకి వెళ్లి వారిని పిలిపించి, కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తూ సస్పెండ్ చేస్తానని బెదిరించారని, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో, బదిలీల్లో జరిగిన అవకతవకలు, కోర్టు ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యం, ఉపాధ్యాయులపై బెదిరింపులు, మానసిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, కేజీబీవీ సీఆర్టీ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదు కార్యక్రమంలో వీసీకే జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శోభన్ పాల్గొన్నారు.






