విఠల్‌నగర్, చీరాల, బాపట్ల, ఆంధ్రప్రదేశ్ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 16
చీరాల విఠల్‌నగర్‌లోని ఆరె రాఘవరెడ్డి మెమోరియల్ హైస్కూల్లో క్రీడాకారులను, ప్రజాసేవకులను సన్మానించారు.
క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు ప్రజాసేవలో విజయం సాధించిన వారిని అభినందించడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. చీరాల విఠల్‌నగర్‌లోని ఆరె రాఘవరెడ్డి మెమోరియల్ హైస్కూల్ ప్రాంగణంలో పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థి క్రీడాకారుడికి, పాఠశాల పూర్వ విద్యార్థి, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధికి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి, పాఠశాలతో పాటు చీరాల ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చిన 8వ తరగతి విద్యార్థి లుక్కా పవన్ కుమార్‌ను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. విద్యార్థి ప్రతిభను గుర్తించి నగదు బహుమతిని అందజేసింది. పవన్ కుమార్‌ను క్రీడల్లో తీర్చిదిద్ది, ఈ విజయానికి కృషి చేసిన పాఠశాల పీఈటీ గునిమిని రామిరెడ్డిని సైతం ఘనంగా సత్కరించింది.
అదేవిధంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో చీరాల మున్సిపాలిటీ 37వ వార్డు కౌన్సిలర్‌గా 627 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన పాఠశాల పూర్వ విద్యార్థి కీర్తి వెంకటరావు (కేవీ)ను పాఠశాల తరఫున ప్రత్యేకంగా సన్మానించారు. ఓరియంటల్ స్కూల్ కరస్పాండెంట్ అనిల్ కుమార్ రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ బత్తుల బ్రహ్మారెడ్డి ఆయనకు శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ప్రజా ప్రతినిధిగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఓరియంటల్ స్కూల్ అధినేత అనిల్ కుమార్ రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ బత్తుల బ్రహ్మారెడ్డి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు భవనం బద్రిరెడ్డి, గౌతమీ విద్యాసంస్థల అధినేత ఎం. వెంకటేశ్వర్లు, 37వ వార్డు కౌన్సిలర్ కీర్తి వెంకటరావు, కోరమాండల్ సుబ్బరామిరెడ్డి, బొందలపాటి శ్రీనివాసరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తూ, ప్రజాసేవకులను గౌరవిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం సందడిగా సాగింది.


