ప్రకాశం, 2026-11-16
ప్రకాశం జిల్లా శిశు గృహలో సంరక్షణ పొందుతున్న ఏడాది వయసున్న చిన్నారి అమెరికా దంపతుల ఒడికి చేరింది.
ప్రకాశం జిల్లా శిశు గృహలో సంరక్షణ పొందుతున్న ఏడాది వయసున్న చిన్నారి అమెరికా దంపతుల ఒడికి చేరింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో స్థిరపడిన సాఫ్ట్వేర్ ఉద్యోగులైన రోహిత్, ప్రియాంక దంపతులు ఆ చిన్నారిని చట్టబద్ధంగా దత్తత తీసుకున్నారు. సోమవారం ప్రకాశం భవన్లో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సమక్షంలో ఈ దత్తత కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా, చిన్నారికి సంబంధించిన చట్టబద్ధ దత్తత ఉత్తర్వులను కలెక్టర్ దంపతులకు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దత్తత తీసుకున్న చిన్నారికి మంచి భవిష్యత్తును అందించాలని, ప్రేమానురాగాలతో పెంచుతూ విద్య, ఆరోగ్యం, భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని దంపతులకు సూచించారు. చిన్నారి జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆమెకు అన్ని విధాలా అండగా నిలవాలని ఆకాంక్షించారు. దత్తత తీసుకున్న రోహిత్, ప్రియాంక దంపతులు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందినవారని, చిన్నతనంలోనే అమెరికాకు వెళ్లి అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి ఏ. పద్మ సునంద, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి. దినేష్ కుమార్, శిశు గృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


