ప్రకాశం, 16 November
కందుకూరు టి.ఆర్.ఆర్.
కందుకూరు టి.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో సోమవారం ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో, ఈగల్ సెల్, గుంటూరు వారిచే మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఈగల్ టీం అధికారులు శ్యామ్ ప్రసాద్, మునాఫ్, లక్ష్మణ్ మరియు అరుణ అధికారులు హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ డా. ఎం. రవికుమార్ అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి వివరంగా అవగాహన కల్పించారు. గంజాయి, హెరాయిన్, కొకైన్, సింథటిక్ డ్రగ్స్, వేపింగ్, గుట్కా వంటి మాదకద్రవ్యాల వాడకం వల్ల మెదడు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతినడం, జ్ఞాపకశక్తి తగ్గడం, చదువుపై శ్రద్ధ కోల్పోవడం, మానసిక రోగాలకు గురికావడం వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని వివరించారు.
మాదకద్రవ్యాలకు బానిసైన వ్యక్తి జీవితం భయంకరంగా మారుతుందని, ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించుకునే విచక్షణా శక్తిని కోల్పోతారని, తల్లిదండ్రుల ఆశలు, తన భవిష్యత్తు, చదువు, ఉద్యోగం అన్నీ నాశనమవుతాయని తెలియజేశారు. మాదకద్రవ్యాల విక్రేతలు కళాశాల విద్యార్థులను స్నేహం, సోషల్ మీడియా, పార్టీల పేరుతో లక్ష్యంగా చేసుకుని, మొదట ఉచితంగా ఇచ్చి తర్వాత బానిసలుగా మార్చే విధానం గురించి వివరించారు.
ఎన్.డి.పి.ఎస్. చట్టం ప్రకారం మాదకద్రవ్యాల వాడకం లేదా అమ్మకం వంటి నేరాలకు పాల్పడితే జైలు శిక్ష, జరిమానా, క్రిమినల్ రికార్డు వంటి తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఒక్కసారి కేసు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగం, పాస్ పోర్టు, ఉన్నత చదువులు కోల్పోతారని తెలియజేశారు.
ఎవరైనా మాదకద్రవ్యాలు వాడుతున్నట్లు తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు లేదా 112 కు సమాచారం ఇవ్వాలని, ఈగల్ పోర్టల్ ద్వారా అజ్ఞాతంగా కూడా ఫిర్యాదు చేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి పేరు బయటకు రాదని వివరించారు. కళాశాలను 100 మాదకద్రవ్య రహిత క్యాంపస్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి తోటి విద్యార్థులను కూడా కాపాడాలని, ఇబ్బందుల్లో ఉన్న వారిని కౌన్సిలింగ్ ద్వారా బయటకు తీసుకురావడానికి కళాశాల సిద్ధంగా ఉందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో 175 మంది విద్యార్థులు పాల్గొని మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఈగల్ క్లబ్ కోఆర్డినేటర్లు శ్రీ కరుణ రత్నకుమార్, ఎస్.డి. ఖాదర్ బాషా, అధ్యాపకులు డా. రాజ గోపాల్, డా. తిరుపతి స్వామి, డా. మల్లికార్జున, నాగ మల్లేశ్వరి, గౌరీ శంకర్ కుమార్, మోషే, జీవన్, హరీష్ మరియు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


