తాడేపల్లిగూడెం గ్రామీణం, 14 November
తాడేపల్లి పోలీస్ స్టేషన్లో గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రూపొందించిన గోడ పత్రికను తాడేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) పి. వీరేంద్ర బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ వీరేంద్ర బాబు మాట్లాడుతూ, బాలలందరూ ప్రతిరోజూ ఆనందంగా బాల్యాన్ని గడిపే హక్కును కలిగి ఉన్నారని తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా పిల్లలందరికీ సమాన హక్కులు అందాలని, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
సహాయ విద్యాశాఖ అధికారి జి. శాంత కుమారి మాట్లాడుతూ, బాల్యం బందీఖానా కాకుండా స్వేచ్ఛగా సాగిపోవాలని పేర్కొన్నారు. బాలల సంఘాల ద్వారా పిల్లల్లో నూతన ఉత్సాహం కలుగుతుందని, బడి ఈడు పిల్లలందరూ తప్పనిసరిగా బడిలోనే ఉండేలా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ కవిత, ప్రిన్సి, తాడేపల్లి ఎస్సైలు సి.హెచ్. అపర్ణ, ఎస్.కె. ఖాజావల్లి, అత్తోట పోతురాజుతో పాటు పలువురు పాల్గొన్నారు.






