చిలకలూరిపేట, 2026-11-28
చిలకలూరిపేటలో ఇసుక లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది, ద్విచక్ర వాహనం ఇసుకలో కూరుకుపోయింది.
చిలకలూరిపేట పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న సాయిబాబా గుడి బజారు మీదుగా రిజిస్ట్రార్ ఆఫీస్ వైపు వెళుతున్న ఇసుకతో ఓవర్‌లోడ్‌తో ఉన్న టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. గతంలో మంచినీటి పైప్‌లైన్ లీకేజీ కారణంగా మున్సిపాలిటీ అధికారులు ఆ మార్గంలో గుంత తీసి మట్టితో పూడ్చివేశారు. తాజాగా ఓవర్‌లోడ్‌తో వెళుతున్న టిప్పర్ చక్రాలు ఆ మెత్తటి మట్టిలో ఇరుక్కుపోవడంతో వాహనం ఒక్కసారిగా పక్కకు ఒరిగి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్కడే నిలిపి ఉన్న ఒక ద్విచక్ర వాహనం పూర్తిగా ఇసుకలో కూరుకుపోయింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. టిప్పర్ తొలగింపు చర్యలు చేపట్టారు.







