త్రిపురాంతకం (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 23
త్రిపురాంతకం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నూతన ఎంపిపి కె. మాధవి, గ్రామ సర్పంచి అభ్యర్థిని మోటకట్ల సునీతను ఎంపీటీసీ సభ్యులు బొందలపాటి బాల నాసర్, డీలర్ బొందలపాటి శాంతారావు, ప్రముఖ కవి, రచయిత గొట్టిముక్కుల నాసరయ్య, గోదా దయాకర్ కలిసి అభినందనలు తెలియజేశారు. అంబేద్కర్ కాలనీ వాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాసేవకు లభించిన ఈ పదవి ఒక గొప్ప బాధ్యత అని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, విద్య, వైద్యం, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. ప్రజాప్రతినిధిగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ, పార్టీకి అతీతంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసినప్పుడే పదవికి నిజమైన సార్ధకత చేకూరుతుందని పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధికి సమన్వయంతో కృషి చేస్తూ, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.
అనంతరం నూతన ఎంపీపీ కె. మాధవి శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి సహకారం, సలహాలు, సూచనలతో మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీపీ కె. మాధవి తెలిపారు.







