గుంటూరు, 2026-11-25
గుంటూరు నగరంలో చేపడుతున్న ప్రాజెక్ట్ పనులను నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని నగర కమిషనర్ కే.
గుంటూరు నగరంలో చేపడుతున్న ప్రాజెక్ట్ పనులను నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్సు హాల్ నందు శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం, ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3, మిర్చి యార్డ్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం, అమృత్ 2.0 కింద గుంటూరు రూరల్ ప్రాంతాల్లో ఈఎల్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణం, బీఆర్ స్టేడియం మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణం, నందివెలుగు రోడ్డు ఆర్ఓబీ నిర్మాణ అభివృద్ధి పనులపై ఆయా విభాగాల అధికారులు, జీఎంసీ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతం నగరంలో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు గుంటూరు నగరానికి తలమానికంగా నిలుస్తాయని, అందుకు తగిన విధంగా నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనే, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేయాలని ప్రతి పనికి తగిన కాలపరిమితి విధించుకొని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. శంకర్ విలాస్ వంతెన పనులు త్వరితగతిన చేయుటకు అధికారులు చర్యలు తీసుకోవాలని, సైడ్ డ్రెయిన్ నిర్మాణ పనులు, సర్వీసు రోడ్డు నిర్మించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 నిర్మాణ పనులు జనవరి చివరినాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, పోల్స్ షిఫ్టింగ్, సెంటర్ డివైడర్, గ్రీనరీ అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 3 లో పలకలూరు నుండి అంతర్గత రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
అమృత్ 2.0 పథకం కింద రూరల్ ప్రాంతాలలో మంజూరు అయిన ఈఎల్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణ పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకొని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, ఈఎల్‌ఎస్‌ఆర్‌ల నుండి డిస్ట్రిబ్యూషన్ లైన్లు, ప్రధాన పైప్ లైన్ పనులకు సంబంధించిన మ్యాప్‌లను అందజేయాలని సూచించారు. యాదవ డొంక అభివృద్ధి చేయడానికి ఆర్డీపీ తయారు చేయాలని, అలాగే పోలిశెట్టి కుంట నుండి జొన్నలగడ్డ రోడ్డు అభివృద్ధి చేయడానికి ఆర్డీపీ సిద్ధం చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. మిర్చి యార్డ్ వద్ద ఫ్లైఓవర్ పనులను డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బీఆర్ స్టేడియం అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా బీఆర్ స్టేడియం నందు అభివృద్ధి చేస్తున్న వివిధ కోర్టులు, ప్లే గ్రౌండ్స్, జిమ్, బాక్సింగ్ వంటి వాటిని ఆధునిక హంగులతో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. సదరు పనులు ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని, పనులు వేగవంతం చేయడానికి నగర పాలక సంస్థ నుండి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. నందివెలుగు రోడ్డు ఆర్ఓబీ పనులలో భాగంగా ఆర్బీ అధికారులతో జీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయం చేసుకొని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశాల్లో ఆర్డీఓ శ్రీనివాస రావు, సిటీ ప్లానర్ రాంబాబు, జీఎంసీ ఎస్ఈ జి.వెంకటేశ్వర రావు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు, డీఎస్డీఓ, ఆర్బీ ఇంజనీరింగ్ అధికారులు, జీఎంసీ ఈఈలు, రైల్వే అధికారులు, ఎన్హెచ్ఏఐ ఏఈ, ఆయా ప్రాజెక్టుల కాంట్రాక్టర్ ప్రతినిధులు పాల్గొన్నారు.







