చీరాల పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ, శానిటేషన్ పరిస్థితి అధ్వానంగా మారిందని దళిత బహుజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ జిలాని ఆరోపించారు. ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు సైతం సరైన నిర్వహణ లేక అపరిశుభ్రంగా మారాయని ఆయన తెలిపారు.
మసీదు సెంటర్ నుంచి కొత్తపేటకు వెళ్లే మార్గంలో కొంతకాలంగా కొనసాగుతున్న డ్రైనేజీ పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని జిలాని పేర్కొన్నారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అధికారులకు, ఎమ్మెల్యేకు విజ్ఞప్తి
పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, మరుగుదొడ్లను పరిశుభ్రంగా నిర్వహించాలని మున్సిపల్ అధికారులను కోరారు. ఈ సమస్యలపై చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో, మున్సిపల్ డీఈకి షేక్ జిలాని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, దళిత బహుజన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












