రాష్ట్రంలో చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆప్కో చేనేత వస్త్ర ప్రదర్శనను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురువారం సందర్శించారు. స్పీకర్ అయ్యన్నపాత్రులు, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి ఆమె స్టాళ్లను పరిశీలించి, వస్త్రాలను కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ చేనేత వస్త్రాల నాణ్యతను ప్రశంసించారు. చేనేత వస్త్రాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం నేతన్నలకు ఎంతో మేలు చేస్తుందని ఆమె అన్నారు. ఇలాంటి ప్రదర్శనలు చేనేత కళను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
చేనేత దుస్తులు ధరించడం ద్వారా ప్రజలు సంప్రదాయ వృత్తికి మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. వారంలో ఒకరోజు చేనేత దుస్తులు ధరించడం ద్వారా నేతన్నలకు ఆర్థికంగా చేయూతనిచ్చిన వారమవుతామని ఆమె పేర్కొన్నారు.
ఈ ప్రదర్శనలో వివిధ రకాల చేనేత వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. నేతన్నల నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా ఈ వస్త్రాలు తీర్చిదిద్దబడ్డాయని అధికారులు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వారు వివరించారు.


