తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను చందోలు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.30 లక్షల విలువైన 182 గ్రాముల బంగారం, 1,050 గ్రాముల వెండి వస్తువులతో పాటు రూ.3 లక్షల విలువైన రెండు పల్సర్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.33 లక్షలుగా పోలీసులు తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బి. ఉమామహేశ్వర్ కేసు వివరాలను వెల్లడించారు. పిట్టలవానిపాలెంలో రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో జరిగిన చోరీపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాలు, సీసీటీవీ-360, టవర్ లొకేషన్ తదితర సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితులను గుర్తించారు. న రెడ్డిపాలెం సెంటర్ వద్ద వీరంకి జానకి సతీష్ బాబు (25), వీరంకి దావీదు (32)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై చందోలు, భట్టిప్రోలు, నగరం, అడవులదీవి, కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఏడు చోరీ కేసులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు బెట్టింగ్, ఇతర వ్యసనాల కోసం దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.











