కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ప్రేమోన్మాది చేతిలో ఒక యువతి దారుణ హత్యకు గురైంది. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందన్న కక్షతో ఆమె గొంతు కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట అగ్రహారానికి చెందిన కీర్తన అనే విద్యార్థిని, ఆంజనేయులకొట్టాలు గ్రామానికి చెందిన వెంకటేష్ (19) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వెంకటేష్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
కీర్తనను పెళ్లి చేసుకోవాలని వెంకటేష్ ఆమెను ఒత్తిడి చేశాడు. అయితే, కీర్తన అందుకు అంగీకరించలేదని సమాచారం. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఆగ్రహానికి గురైన వెంకటేష్, కీర్తనపై కత్తితో దాడి చేసి ఆమె గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన కీర్తనను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కడపలోని రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.







